కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం మళ్లీ జలకళను సంతరించుకుంటున్నది. గతంలో 15 టీఎంసీల నీటిని నింపిన తర్వాత సాంకేతిక పరిశీలనలో భాగంగా జలాశయాన్ని ఖాళీచేసిన అధికారులు కొన్ని రోజులుగా తిరిగి నింపే ప్రక్రియ చేపట్టారు. తాజాగా జలాశయంలో నీటినిల్వ 9.8 టీఎంసీలకు చేరుకున్నది. ఈసారి పూర్తిస్థాయిలో జలాశయాన్ని నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో శ్రీరాజరాజేశ్వర జలాశయం కీలకమైనది. లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్ నుంచి మొదలయ్యే గోదావరి జలాల ఎత్తిపోత.. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి చేరుకున్న తర్వాతే ప్రధానమైన ఆయకట్టు ప్రస్థానం మొదలవుతుంది.
ఈ క్రమంలోనే జలాశయం నుంచి ఒకవైపు లోయర్ మానేరుకు నీటిని అందించడంతోపాటు మరోవైపు రంగనాయకసాగర్‌కు అటు నుంచి మరో కీలకమైన మల్లన్నసాగర్ ద్వారా భారీ ఎత్తున ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు వీలవుతుంది. అంటే ప్రాజెక్టులో రాజరాజేశ్వర జలాశయం అనేది కేంద్ర బిందువుగా మారింది. ఎగువ నుంచి చుక్క నీరు రాకున్నా ఎల్లంపల్లి.. అక్కడి నుంచి నంది పంపుహౌస్.. ఆ తర్వాత గాయత్రి పంపుహౌస్‌లోని బాహుబలి మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో ఈ జలాశయానికి జలకళ వచ్చింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీలు. గత ఏడాదివరకు గరిష్ఠంగా నాలుగైదు టీఎంసీల వరకే నింపారు. కానీ ఈసారి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రావడంతో 15 టీఎంసీల వరకు నింపారు. జలాశయం నిర్మాణం తర్వాత తొలిసారిగా ఈస్థాయి నిల్వ చేసినందుకు సాంకేతిక ప్రొటోకాల్‌లో భాగంగా పరిశీలించారు. అయితే బండ్‌కు దిగువన ఒకచోట ఏకంగా 15 ఎకరాల మేర చవుడు భూమి ఉండటం, భారీ ఎత్తున వర్షాలు పడిన నేపథ్యంలో అక్కడ మట్టి చాలా బురదగా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అక్కడ 150 మీటర్ల బండ్‌ను మరో 20 మీటర్ల మేర పొడిగించారు. ప్రొటోకాల్ ప్రకారం చర్యలన్నీ పూర్తయిన తర్వాత కొన్నిరోజులుగా తిరిగి జలాశయాన్ని నింపే ప్రక్రియ మొదలుపెట్టారు.