ఆరోగ్య తెలంగాణ సాకారం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయక త్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారమవుతున్నది. ప్రభుత్వం కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విస్తృత సేవలతో పేదలకు సర్కారు వైద్యం మరింత చేరువైంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పురోభివృద్ధిలో పయనిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమంలో ప్రతి ఇంట వెలుగులు నింపి, ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు అండగా నిలిచి, కేసీఆర్ కిట్లతో మహిళల్లో భరోసా నింపుతూ.. వైద్య, ఆరోగ్యసేవల్లో వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్నది. రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాలు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుతో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ.. జాతీయ ఆరోగ్యమిషన్ సూచనల మేరకు అన్ని దవాఖానల్లో ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌరులందరి ఆరోగ్య సమాచారాన్ని పొందుపరిచి తక్షణ వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంలో హెల్త్ ప్రొఫైల్ అమలుచేయాలని నిర్ణయించింది.