భార‌త్ చేతిలో ఓట‌మి..నాకో మేలుకొలుపు: లాంగర్

స‌్వ‌దేశంలో భారత్ చేతిలో టెస్టు సిరీస్ ఓట‌మి త‌న కోచింగ్ కెరీర్‌కు మేలుకొలుపు లాంటిద‌ని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ జ‌స్టిన్ లాంగర్ అన్నాడు. 2018-19లో జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విరాట్ కోహ్లీ సార‌థ్యంలోని భార‌త్ 2-1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేన స‌రికొత్త చ‌రిత్ర నెల‌కొల్పింది.


దీనిపై శ‌నివారం ఓ మీడియా సంస్థ‌తో లాంగ‌ర్ మాట్లాడుతూ త‌న కోచింగ్ కెరీర్ తొలినాళ్ల‌లో ఎదురైన అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. ‘భార‌త్ చేతిలో సిరీస్ ఓట‌మి..నా జీవితంలో చాలా క్లిష్ట‌మైన స‌మ‌యం. సొంత‌గ‌డ్డ‌పై ప‌రాజయం కోచింగ్ కెరీర్‌లో నాకో మేలుకొలుపు లాంటిది. ఇంకో పదేండ్ల త‌ర్వాత ఒక్క‌సారిగా వెనుతిరిగి చూసుకుంటే నా కెరీర్ ఎలా మొద‌లైందో చూసుకోవ‌చ్చు. దీనికి తోడు 2001లో న‌న్నుజ‌ట్టు నుంచి త‌ప్పించారు. 31 ఏండ్ల వ‌య‌సులో ఇక నా ప‌ని అయిపోయింద‌నుకున్నా. క్లిష్ట‌మైన ప‌రిస్థితులే జీవితంలో ఎలా నిల‌దొక్కుకోవాలో నేర్పిస్తాయి. వాటిని మ‌నం గుర్తిస్తే.. అద్భుత‌మైన వ్య‌క్తిగా మారేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది ’ లాంగ‌ర్ అన్నాడు. 


ఇదిలా ఉంటే ద‌క్షిణాఫ్రికాతో 2018లో జ‌రిగిన‌టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డినందుకు అప్ప‌టి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వార్న‌ర్‌, బాన్‌క్రాఫ్ట్ పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఆ స‌మ‌యంలో చీఫ్ కోచ్‌గా ఉన్న లీమ‌న్ స్థానంలో లాంగ‌ర్ బాధ్య‌తలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.